స్థిరాస్తి అమ్మకం పై TDS 194IA
వ్యవసాయ భూమి కి TDS రాదు. మిగితా భూములకు మరియు స్థిరాస్తులకు క్రింది విధముగా TDS వస్తుంది:
TDS ఎప్పుడు వస్తుంది?
అమ్మిన భూమి/ఇల్లు/స్థిరాస్తి యొక్క విలువ ₹50 లక్షలు దాటితే,
- కొనుగోలుదారుడు తాను అమ్మకదారుడికి ఇచ్చే మొత్తం లో 1% పట్టుకుని, మిగితా 99% అమ్మకదారుడికి ఇవ్వవలసి ఉంటుంది.
- పట్టుకున్న 1% ను కొనుగోలుదారుడు Income Tax department కు (Sec 194IA) కట్టవలసి ఉంటుంది. ఒకవేళ పట్టుకోకపోతే కొనుగోలుదారుడే ఆ tax ను భరించవలసి ఉంటుంది.
- ఒప్పుదల ప్రతిఫలం కంటే ప్రభుత్వ విలువ ఎక్కువ ఉంటే, ఆ ప్రభుత్వ విలువ మీద TDS కట్టవలసి ఉంటుంది.
- ప్రభుత్వానికి ముట్టిన డబ్బులు తిరిగి అమ్మకదారుడి PAN number మీదికి వచ్చి పడతాయి.
ఒకవేళ కొనుగోలుదారులు ఒకరి కంటే ఎక్కువ ఉంటే ఎలా?
ఉదాహరణ:
- అమ్మకదారుడు – 1
- కొనుగోలుదారులు – 4
- ప్రభుత్వ విలువ – ₹53 లక్షలు
ఇప్పుడు,
- ఒక్కొక్క కొనుగోలుదారుడు ₹13,250/- చొప్పున (₹53 లక్షల లో 1% ను నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరు నాల్గవ భాగాన్ని) పట్టుకుని ప్రభుత్వానికి విడివిడిగా కట్టాలి.
- అంటే నలుగురు కలిపి మొత్తం ₹53,000/- ప్రభుత్వానికి అందజేయవలసి ఉంటుంది.
- అందరు కొనుగోలుదారుల బదులు ఒక్కరు ప్రభుత్వానికి కట్టడం కుదరదు.
ఎక్కడ కట్టాలి?
✅ Income Tax website లో.
కట్టే Form number ఏంటి?
✅ Form 26QB.
ఎప్పటి లోపు కట్టాలి?
✅ ఏ రోజైతే రిజిస్ట్రేషన్ జరిగినదో, ఆ నెల చివరి నుండి 30 రోజుల లోపు కట్టవలసి ఉంటుంది.
ఆలస్యంగా కడితే కొనుగోలుదారుడు ఏం ఎడురుకోవలసి ఉంటుంది?
- గడువు లోపు కట్టకపోతే:
- రోజుకు ₹200/- ఫీజు (Sec 234E) గరిష్టంగా TDS amount దాటదు.
- 1.5% వడ్డీ (Sec 201(1A))
- ఒక సంవత్సరం ఆలస్యం చేస్తే:
- ₹10,000/- నుండి ₹1,00,000/- వరకు జరిమానా (Penalty) (Sec 271H).
- అసలు కట్టకపోతే:
- గరిష్టంగా 100% TDS జరిమానా (Penalty) (Sec 201).
- రిజిస్ట్రేషన్ జరిగిన 6 సంవత్సరాల లోపు ఎప్పుడైనా Income Tax department నుండి నోటీసు రావొచ్చు.
కొనుగోలుదారుడికి Sec 201 వర్తించకుండా ఉండాలంటే?
కొనుగోలుదారుడికి Sec 201 క్రింద నోటీసు రాకుండా ఉండాలంటే, అమ్మకదారుడు ఈ క్రింది పనులు చేయాలి -
- గడువు తేదీ లోపు తన Income Tax Return (ITR) filing చేయాలి.
- ITR లో ఈ రిజిస్ట్రేషన్ వలన వచ్చిన ఆదాయాన్ని చూపించాలి.
- ITR లో కట్టవలసిన Tax ఉంటే, కట్టి ఉండాలి.
- Chartered Accountant నుండి Form 26A తీసుకుని, Income Tax Department కు ఇవ్వాలి.